అతడు బిళహరి కాకపోవచ్చు కానీ
నిన్న మధ్యాహ్నం రెండు గంటలప్పుడు బ్యాంకు లో భోజనం చేస్తుంటే ఒక ఫేస్ బుక్ మిత్రుడు ఫోన్ చేసి బాలు ఇక లేరు అన్న వార్త చెప్పేసాడు . ఉదయం నిండి ఊహించిందే అయినా ఆ వార్త విన్నాక ఎందుకో కానీ మరి ముద్ద గొంతు దిగనని మారాం చేసింది . ఆ మిత్రుడు బాలు వార్త చెప్పి ఆగకుండా " బాలు కి ఫలానా గాయనికి మధ్య ఉన్న ఎఫైర్ నీకు తెలుసా ? ఆయన దగ్గర బంధువే నాకు చెప్పాడు ?" అంటూ మరింకా ఏదో చెప్పబోయాడు కానీ నాకు అంత ఆసక్తి లేక " సర్ తరువాత " అని పెట్టేసాను .
ఆ తరువాత రాత్రిఎప్పుడో ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే ఆ మిత్రుడే " ఆహా బాలూ ! ఓహో బాలూ !" అంటూ పెట్టిన పోస్ట్ ఒకటి కనిపించింది . మరొక మిత్రుడు " అతడికి సంగీతం ఏమితెలుసు ? అతడు 40000 ల పాటలు పాడటం అతడిని గాయకుడుగా గుర్తించడానికి క్రైటీరియా కాదు " అన్నాడు . మరొక పోస్ట్ " సవాలక్ష స్వరాలలో అతడిదొక స్వరం . చావును సెలబ్రేట్ చేయడం ఏమిటి ?" అని విసుక్కుంది . తెలంగాణా ఉద్యమం బలంగా ఉన్న కాలం లో " బాల సుబ్రహ్మణ్యం దొడ్డు గొంతు ను ఆంధ్రా వాళ్ళు బలంగా రుద్దారు " అని ఒక కవి గాయకుడు వాక్రుచ్చాడు
మరికొంత మంది అతడు తోక్కేసిన స్వరాల కు ఆయన మరణం సందర్భంగా సానుభూతి ప్రకటించారు . ఇంకొంతమంది ఆయన బ్రాహ్మణ ఆధిపత్యం గురించి కూడా మాట్లాడారు
నేను సైగల్ , మన్నాడే , కిషోర్ , రఫీ , జేసుదాసు , హరిహరన్ , సురేష్ పీటర్ , ఘంటసాల , పి బి శ్రీనివాస్, ఏ ఎం రాజా , జానకి సుశీల లత గీత ఆశ ఇలా ఎంతోమంది గాయకులతో పాటు బాలసుబ్రహ్మణ్యాన్ని కూడా వింటాను . వాళ్ళందరూ ఎక్కడ చదువుకున్నారో , ఏమి చదువుకున్నారో , సంగీతం లో వాళ్ళ గురువులెవరో నాకు తెలియదు . కానీ బాలు ఇంజనీరింగ్ చదువుకున్నాడని , సంగీతం లో సరిగమలు కూడా తెలియదని ఆయనే పలుసార్లు చెప్పుకోగా విన్నాను చదివాను .
ఆయన రుద్రవీణ లో బిళహరి కాదు కానీ కచ్చితంగా సూర్యమే
ఘంటసాలను మాస్టారు అంటూ దూరంగా ఉండి ఆశ్చర్యఅద్భుత నేత్రాలత్లో భక్తి ప్రపత్తులతో చూసిన నేను పైన చెప్పిన వాళ్లందరినీ ఒక్కసారి కూడా చూడలేదు కానీ బాలును కొన్ని వందల సార్లు చూసి వుంటాను . పరోక్షంగా అయినా సరే కొన్ని వందల సారాలు మాట్లాడి వుంటాను . అతడు చూపించే వినయానికి చిరాకుపడి , అంత వినయంగా ఉండక్కరలేదు అంటూ బాలసుబ్రహ్మణ్యమూ వినయమూ అంటూ రాసాను కూడా . అలా అతడి సుగుణాలు , లోపాలు నాతో పాటు నా తరం మొత్తానికి తెలుసు . అలా ఓపెన్ గా ఉండటమే అతడి విజయం అనుకుంటాను .
మిగతా గాయకులు లా కాకుండా విపరీతంగా జనం లోకి వెళ్లడమే అతడి మరణం కలిగిస్తున్న ఇంతటి దుఃఖానికి కారణం అనుకుంటున్నాను . వీధి చివర మరణానికీ , ఇంట్లో మరణానికీ తేడా ఉంటుంది కదా . బాలూ మరణం ఇంట్లో సంభవించిన మరణం . ఈ దుఃఖం ఇప్పటి లో తీరదు
అతడి విజయం అతడు పదహారు భాషలలో పాడిన నలభై వేల పాటలలో లేదు . తన స్వరాన్ని పాటకు అనుగుణంగా మలచుకున్న తీరులో వుంది . తనకు తెలియని దానిని తెలుసుకుని ఆత్మలోకి తీసుకుని పాడటంలో వుంది . తనకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవడం లో వుంది. తనను తాను విస్తరింప చేసుకోవడం లో వుంది . పాడుతూ నేర్చుకోవడం లో వుంది . తనకు ఆవగింజంతైనా నేర్పిన గురువులను జ్ఞాపకం పెట్టుకోవడం లో వుంది . ఆ జ్ఞాపకాలని సమయం వచ్చినప్పుడల్లా పంచుకోవడం లో ఉంది అప్పుడెప్పడో ధిషణాహంకారం తో విశ్వనాథ నా లాంటి శిష్యుడు దొరకడం చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారి అదృష్టం అన్నాడట . బాలు లాంటి శిష్యుడు దొరకడం రసరాగాల బాణీ కోదండ పాణి అదృష్టం . తన రికార్డింగ్ థియేటర్ కి బాలు పెట్టిన పేరు కోదండ పాణి రికార్డింగ్ థియేటర్
తన ముందు తరాలను బాలు మరచిపోలేదు . తన తరువాత తరాన్ని తయారుచేయకుండా ఉండనూ లేదు . అయినా బాలు అందరినీ తొక్కేసాడనే అంటారు . అందులో కొంత నిజం ఉండవచ్చు . మరికొంత అతిశయోక్తీ ఉండవచ్చు . విజయం వెంట పరుగులు తీసే చిత్ర పరిశ్రమ బాలు విజయం వెనుక పరుగులు తీసిందేమో . ఎవరికీ పాడితే వారే పాడినట్లు అనిపించేలా పాడటం బాలు కి మాత్రమే తెలిసిన విద్య . అది మిమిక్రీ అయితే మాత్రమేమిటి ? ప్రజలను రంజింప చేశాక ?
పదహారేళ్ళ వయసులో ఉన్న అమ్మాయో , అబ్బాయో ప్రేమిస్తున్నాను అన్న భావాన్ని ప్రేమించినంతగా తన భాగస్వామిని ప్రేమించరు అలాగే చాలా మంది తమకు వున్న ప్రతిభకంటే లక్ష రెట్లు ప్రతిభ ఉందని అనుకుంటారు . ప్రతిభ ఉందని అనుకోవడం వేరు , ప్రతిభ ఉండటం వేరు . ఉపేంద్ర అనే సంగీత దర్శకుడి కోసం 12 గంటల్లో 21 పాటలు పాడటం ప్రతిభ వుంది అనుకుంటే సాధ్యం కాదు.
నలభయి వేలకి పైగా పాటలు పాడటం గాయకుడు అనడానికి క్రైటీరియా కాకపోవచ్చు కానీ ఆ నలభైవేల పాటలలో ఒకటి రెండు కూడా అద్భుతమైన పాటలు లేవు అంటే మాత్రం ఆ శ్రోత ను సందేహించాల్సిందే . జీవన తరంగాలు సినిమాలో ఘంటసాల మాస్టారు రమోలా తో కలిసి ఉడుతా ఉడుతా హూచ్ అనే పాట పాడటానికి ఏంటో కష్టపడ్డారు . ఆ కష్టం మాస్టారి గాయనం లో కనిపిస్తూనే , వినిపిస్తూనే ఉంటుంది . ఎందుకంటే అది మాస్టారి జానర్ కాదు . అప్పటికి ఓ పదేళ్లుగా అలంటి పాటలే బాలు పాడుతూ వస్తున్నాడు . ఘంటసాల మాస్టారు బాలు వత్తిడి కలగచేసాడు అంటే నన్నందరూ ట్రోల్ చేస్తారేమో కానీ కళాకారుల మీద ఆ వత్తిడి తప్పకుండా ఉంటుంది . అలాంటి వత్తిడి తట్టుకోలేకే శంకరాభరణం పాటలను నేను పాడలేను అని నిజాయితీగానే బాలు ఒప్పుకున్నాడు . కానీ మామ మహదేవన్ ధైర్యం ఇచ్చి , వెన్ను తట్టి ప్రోత్సహించి బాలు ను నడిపించాడు . బాలు స్పాంజ్ లాంటి వాడు .ఎలాంటి విషయాన్ని అయినా ఇట్టే తనలోపలికి తీసుకోగలడు . " మీతో కలసి కచేరీ చేయాలనీ వున్నది అని బాల మురళి తో అంటే నాలుగు రోజులు సాధన చేయి . ఒక రోజు కచేరీ చేయవచ్చు " అని బాలమురళి అన్నాడు అంటే బాలు గ్రహణ శక్తి ఎలాంటిదో అర్ధం అవుతుంది
గాయకులుగా బాలు తో ప్రయాణం మొదలుపెట్టిన చాలామంది గాయకులుగానే మిగిలిపోతే బాలు డబ్బింగ్ కళాకారుడిగా , నటుడిగా , స్టూడియో యజమానిగా , నిర్మాత గా , సంగీత దర్శకుడుగా , సంగీత కార్యక్రమాల నిర్వాహకుడిగా , ప్రయోక్తగా తనను తాను విస్తరించుకున్నాడు . దొంగ దొంగ సినిమాలో రైల్వే ప్లాట్ ఫామ్ మీద కదులుతున్న రైలు ఎక్కడానికి పరుగులు తీస్తూ " వెయిట్ , వెయిట్ " అంటే ఆయన చెపుతున్నది వెయిట్ చెయ్యమని కాదు నా వెయిట్ గురించి అంటూ చేసిన అభినయం , ఓ పాపా లాలీ లో తండ్రి పాత్ర
దాదాపు 72 సినిమాలలో తనదయిన నటన తో ఆ పాత్రలను వెలిగించడం ఎవరికీ తెలియని విషయం కాదు .
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ టీ వి వేదికగా ఆయన కనుగొన్న నూతన టాలెంట్ ఒక్కటీ ఒక ఎత్తు . ఆరేళ్ళ క్రితం ఒక రాత్రి నేను నా
మిత్రుడి ఇంట్లో ఉండిపోవలసి వచ్చింది . నా మిత్రుడి తల్లికి అప్పటికే ఎనభై ఏళ్ళు ఉంటాయి . ఆమె బాలుకి పెద్ద అభిమాని . ఆ రాత్రి మేమందరమూ కలసి పాడుతా తీయగా చూస్తున్నాము . నల్లగొండ కి చెందిన సౌజన్యో , ఖమ్మానికి చెందిన లిప్సికానో , మరో సిద్ధిపేట అమ్మాయో సరిగ్గా గుర్తులేదు కానీ మేఘ సందేశం లోని దేవులపల్లి గీతం ఆకులో ఆకునై ఆలపించింది . చాలా బాగా , అద్భుతంగా పాడింది . బాలు ఆ అమ్మాయిని మెచ్చుకుంటూనే " గిరులెక్కి ,తరులెక్కి , అల నీలి చదలెక్కి " అనే వాక్యం మళ్ళీ పాడమని అడిగాడు . ఆ అమ్మాయి పాడితే " అల నీలి చదలు " అంటే అర్ధం తెలుసా అని ప్రశ్నించాడు . ఆ అమ్మాయి తెలియదు అన్నట్టు మొహం కాస్త బిడియంగా పెట్టగానే " నీలి చదలు " అంటే నీలి మేఘాలు అని అర్ధం చెప్పి ఇంకా ఏదో పాటలో గొప్పతనాన్ని వివరిస్తున్నాడు . ఇంతలో వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం వినిపించింది .ఏమిటా అని చూస్తే నా మిత్రుడి తల్లి ఏడుస్తోంది . ఒక్క క్షణం పాటు మాకేమీ అర్ధం కాలేదు . మా కంగారు చూసి ఆమె అతి కష్టం మీద దుఃఖాన్ని ఆపుకుని " ఈ బాలు లేకపోతే ఆ పిల్లలకి మంచీ చెడూ ఎవరు చెప్తారు ? వాళ్ళ తప్పులు అర్ధం అయ్యేట్టు ఎవరు వివరిస్తారు ? నేనిప్పటికే ఎనభై ఏళ్ళు బతికా . జీవితంలో అన్నీ చూసా . ఇంకా ఎన్నాళ్ళు బతికినా అదంతా బోనస్సే . దేవుడు నన్ను తీసుకుని వెళ్లి నా మిగిలిన ఆయుష్షును బాలూ కిస్తే బావుండు ?" అన్నది . ఒక్క క్షణం పాటు నాకళ్ళ లోపల నీళ్లు తిరిగాయి . ఆ తరువాత ఎప్పుడు పాడుతా తీయగా చూసినా నా మితుడై తల్లే గుర్తుకువచ్చేది
ఆమె నిస్వార్ధంగా అలా కోరుకోవడం వెనుక ఏ కుల మతాల ప్రస్తావన , పాండిత్య ప్రకర్షణా , లేదు . అది ఒక శ్రోత కి గాయకుడు కి మధ్య ఉన్న సంబంధం . ఒక హృదయానికి మరొక హృదయానికి మధ్య ఉన్న సంబంధం . ఆ సంబంధాన్ని ఏ భౌతిక ప్రమాణాలతోనూ కొలవలేము . అలాంటి బంధాన్ని బాలు ప్రతి ఒక్కరితో ఏర్పరచుకున్నాడు . అదీ అతడి విజయ రహస్యం .
ముందే చెప్పుకున్నట్టు అతడు సంగీత శాస్త్రాన్ని ఔపోసన పట్టిన బిళహరి కాక పోవచ్చు . కానీ స్వరానికీ , శ్రవణేంద్రియానికీ మధ్య వేసిన అజరామరమైన వంతెన . ఆ వంతెన మీద నుండి ఎన్ని పాటలు నడచి వచ్చి మన హృదయాన్ని వెలిగిస్తాయో
దుఃఖం వధించే అస్త్రం అడిగా
అస్త్రం ఫలించే యోగం అడిగా
అని ఓ పాపా లాలీ లో పాడిన బాలు ఆ యోగం సిద్దించకుండానే వెళ్ళిపోయాడు . ఘంటసాల మాస్టారి పాట పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు , ఉన్నోళ్లు పోయినోళ్ళు తీయి గురుతులు
బాలూ వుయ్ మిస్ యు
0 comments:
Post a Comment