6/24/2016
0

లాభం²

     ఒక యువకుడు తెగ కష్ట పడుతున్నాడు. రాత్రింభవళ్ళు ఆఫీసులొనే ఉంటున్నాడు. కొత్త కొత్త ప్రాజెక్టులు చేస్తున్నాడు. వాటికోసం ఏదేశం వెళ్ళమంటే ఆదేశం వెళుతున్నాడు. ఏ భాషలొ మాట్లాడమంటే ఆ భాషలో మాట్లాడుతున్నాడు. 
భార్య బిడ్డల్ని మరచిపోవాల్సి వస్తే మరచిపోయాడు. అమ్మానాన్నలను చూడకుండా ఉండాల్సివస్తే ఉన్నాడు. స్నేహితులను కలవకుండా ఉండాల్సి వస్తే ఉన్నాడు.

     ఉన్న ఊరే స్వంత ఊరు అనుకున్నాడు. ఉన్న దేశమే స్వదేశం అనుకున్నాడు. ఎప్పుడైనా చంద్రుణ్ణి చూశాడేమో కానీ సూర్యుణ్ణి మాత్రం చూడలేదు. ఆకాశం నుండి భూమిని చాలాసార్లు చూసాడు కానీ భూమిమీద నుండి ఆకాశాన్ని చూడ్డానికి వీలవలేదు అతనికి.
     పక్షుల పేర్లు, పువ్వుల పేర్లు, మొక్కల పేర్లు, అన్ని మరచిపోయాడు. నిత్యం నాలుగు గోడల మధ్యే.
     చాలా కంపెనీలు పెట్టాడు. వేలాది మందికి పని కల్పించాడు. కొన్నేళ్ళకు వృద్ధుడయ్యాడు.

     ఒకసారి మనవడు కాబోలు వచ్చి అడిగాడు తాతా! ఎంత సంపాదించావ్ అని. అడిగింది మనవడు కాబట్టి ముచ్చటపడి ఇనపెట్టెలో ఉన్నదంతా లెక్కేశాడు. ఆస్తులన్ని కూడాడు. కోట్లకోట్లు ఉన్నాయి.

డబ్బు కాదు అన్నాడు మనవడు.
     నా కీర్తికేం తక్కువ? డబ్బుకన్నా అదేఎక్కువ అన్నాడు.
ఇంకా కీర్తి రావాలంటే ఒక మార్గముంది అన్నాడు వాడు.
ఏమిటన్నాడా కోట్లకోట్ల కోటీశ్వరుడు.
డబ్బును దానం చెయ్యడమే అన్నాడు.
కోట్ల కోట్ల కోటీశ్వరుడు ఆలోచించాడు. ఇది బాగానే ఉందనుకున్నాడు. అలాగే చేశాడు. అనుకున్నట్టుగానే మరింత కీర్తి వచ్చింది. 

     ఇప్పుడతను ధనకోటీశ్వరుడే కాక కీర్తికోటీశ్వరుడు కూడా అయ్యాడు.

     ఇందుకోసం ఎందర్ని నొప్పించావని మాత్రం అతన్ని ఎవరూ అడగలేదు. ఎం కోల్పోయావని కూడా ఎవరూ అతన్ని అడగలేదు.

0 comments:

Post a Comment