5/14/2020
0
*చీరె*

రాత్రివేళ ఊరిస్తూ-జారుతూ
శృంగారం వొలికిస్తుంది
తెల్లారగట్ల ఆదరాబాదరాగా-అస్తవ్యస్తంగా
వొంటికి చుట్టుకున్నప్పుడు
హాస్యాన్ని చిలికిస్తుంది!
పుట్టింటివాళ్ళ దగ్గర్నుంచి
కబురొస్తే చాలు కళ్ళొత్తుకుంటూ...
కొంగంతా కరుణరసం వర్షిస్తుంది!!
నీళ్ళ టాంకర్ వీధిలోకొస్తే
బిందెకి సపోర్టింగా నడుమ్మీదకు చెక్కేసి
వీర రసాన్ని ప్రదర్శిస్తుంది
పనిమనిషి 'నాగా'పెడితే 
బొడ్డులోకి దోపీ అంట్ల మీద రౌద్రాన్ని ప్రదర్శిస్తుంది
మొగుడితో గొడవపడ్డ రోజున 
నేలమీద చెంగై పరచుకొనీ
భయానకాన్ని- రుచి చూపిస్తుంది
అకారణంగా పతిదేవుదు తిట్టాడా --
దూలానికి వేళ్ళాడుతూ 
భీభత్సాన్ని... సృష్టిస్తుంది 
పొరపాటయిందే అని బేలగా భర్త కన్నీరు పెట్టాడా !!
అంచుతో తుడుస్తూ అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది!! 
రాజీకొస్తే చాలు మల్లెవంతి తెల్లని ఉల్లి పొరై
శాంతరసాన్ని ... ప్రసాదిస్తుంది!
ఆరంభంలో మన్మధుడి కోట బురుజు పైన భావొద్వేగంతో 
రెపరెపలాడే పతాకంలాంటి చీర !
పది నెల్లు తిరిగేసరికి  పండంటి పాపాయిని 
గుండెల్లో పెట్టుకొని  మాతృ గర్వంతో ఊగిపోతూ 
ఉయ్యాలైపోతుంది !!!     
  
తనికెళ్ళ భరణి. 'పరికిణీ'నుండి..  మీ కోసం🙏

0 comments:

Post a Comment