తర్కాన్ని నాశనం చేస్తేనే ప్రభుత్వాల మనుగడ?
********************************************
'ప్రజలు ఎప్పుడైనా అభివృద్ధి గురించి అడిగితే, వాళ్ళ మతాల మధ్య చిచ్చు పెట్టండి' అని అన్నాడు నెపోలియన్! మనం దేశంలో ఇప్పుడు అదే చూస్తున్నాం. ''జనాన్ని అదుపులో ఉంచుకోవాలంటే వారు ప్రార్థించు కోవడానికి వారికో దేవుణ్ణి ఇవ్వు..'' అన్నాడు నోమ్ చామ్‌స్కీ. ఆధునిక భాషా శాస్త్రానికి పితామహుడైన ఈయన అమెరికన్ తత్త్వవేత్త, చరిత్రకారుడు కూడా! కొన్ని శతాబ్దాల ప్రపంచగతిని గమనించిన ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. నియంతలు, పరిపాలకులు నిరంతరం చేస్తూ వస్తున్న పని అదేనన్నది- ఏమాత్రం ఇంగిత జ్ఞానమున్న వారైనా ఇట్టే గ్రహించ గలుగుతారు. ప్రపంచంలో ముఖ్యంగా మనదేశంలో జరుగుతున్నది ఇదే. ప్రజలు ప్రభుత్వాల జోలికి పోకుండా కొన్ని పథకాలు ప్రవేశపెట్ట బడతాయి. ఉదాహరణకు ప్రభుత్వం ప్రజల మీద ఓ మతాన్ని రుద్దుతుంది. అంతే.. కొందరు దాన్ని ద్వేషిస్తారు. మరికొందరు ప్రేమిస్తారు. బేధాభిప్రాయాలతో వారిలో వారు తన్నుకుని చస్తారు. ప్రభుత్వం జోలికి పోరు. మతం కొత్తదే కానక్కరలేదు. అతి పురాతనమైనదైనా సరే, దాన్ని నెత్తికెక్కించుకుని ప్రాముఖ్యమిస్తే చాలు! అలాగే ప్రజలకు టి.వి. సీరియళ్ళు, సినిమాలు, క్రికెట్టూ ఇస్తే చాలు. ప్రజలు అందులోనే మునిగి తేలుతుంటారు. ప్రభుత్వం జోలికి పోరు. పండుగలకు ఎక్కువ ప్రాముఖ్యమిచ్చి ఎక్కువగా సెలవులిస్తే చాలు. ప్రజలు ఉబ్బి తబ్బిబ్బవుతారు. వారికి వారి బాధలు, ఇబ్బందులు గుర్తుకు రావు. ఆరకంగా వారు, ప్రభుత్వం జోలికి పోరు. ఆ పండుగ సెలవులు కూడా పురాణ పాత్రల విజయాల మీద, మరణాల మీద, పుట్టిన రోజుల మీద, కళ్యాణాల మీదనే ఇవ్వాలి. నూతన ఆవిష్కరణలతో సమాజానికి మేలు చేసిన వారిని గుర్తు చేసుకోగూడదు. దేశం కోసం త్యాగాలు చేసినవారిని స్మరించుకుంటూ వేడుకలు జరపగూడదు. సెలవులూ ఇవ్వగూడదు. అంతే.. ప్రజలు ప్రభుత్వాల జోలికి పోరు.
ప్రజలకు కొన్ని రాజకీయ పార్టీలిస్తే చాలు. ఒకరు అధికారంలో ఉంటారు. ఇతరులు దానికోసం తహతహలాడు తుంటారు. వారిలో వారు పోట్లాడుకుంటూ హత్యలు చేసుకుంటారు. కనీసం టీవీ స్టూడియోల్లో బల్లలు పగలగొట్టుకుంటారు. ఆ వినోద కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాల్లో మునిగిపోయి, ప్రజలు ప్రభుత్వం జోలికి పోరు. ప్రశ్నించడమనే దాన్ని నేర్పించకుండా, స్వయంగా నేర్చుకోవడానికి వీలులేకుండా, బాలబాలికల మెదళుల పసితనంలోనే మొద్దుబారే విధంగా ఒక విద్యావిధానం ప్రవేశపెడితే చాలు, తెలియకుండానే తరతరాలూ నాశనమౌతాయి. అప్పుడు ప్రజలు ప్రభుత్వం జోలికి పోరు. వైద్యరంగాన్ని విచిత్రంగా తయారుచేయాలి. సెలైన్ బాటిల్స్ కూడా ఉండని ఆస్పత్రులుండాలి. పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అంతా కలసి రోజులకు రోజులు 'మృత్యుంజయ హోమాలు' చేయాలి. వారి వైద్యంపై వారికి ఉన్న నమ్మకాన్ని పక్కనపెట్టి వేదపండితుల మంత్రాలపై నమ్మకముంచాలి. రోగులుచావకుండా, బతకకుండా చేస్తూ ఉంటే చాలు. ప్రజలు ప్రభుత్వం జోలికి పోరు. శాంతిభద్రతలు చాలా కట్టుదిట్టంగా ఉంచాలి. మంచినీళ్ళకన్నా మద్యం ఎక్కువగా అందుబాటులోకి తేవాలి. తాగిన వాళ్ళను తాగినట్టుగా 'డ్రంక్ అండ్ డ్రైవ్'లో బుక్ చేస్తూ ఉండాలి. అంతే.. ప్రజలు ప్రభుత్వం జోలికి పోరు. ప్రతి పౌరుడి ఖాతాలో పదిహేను లక్షలేవని గత వాగ్దానాన్ని గుర్తుచేస్తారా? బ్యాంకుల్నే దివాలా తీయించి, అప్పులు ఎగ్గొట్టిన మహానుభావుల్ని లోపాయకారిగా విదేశాలకు పారిపోయేట్టు చేస్తే సరి. ప్రజలు ప్రభుత్వం జోలికి పోరు. ఆర్థిక మాంద్యం గురించి ఆర్థిక వేత్తలు గగ్గోలు పెడితే ఏమౌతుంది? ఎవరో చేతబడి చేస్తే రూపాయి విలువ పడిపోయిందని ప్రకటించాలి. అంతే.. ప్రజలు ప్రభుత్వం జోలికి పోరు.
న్యూటన్, ఐన్‌స్టీన్ లాంటి పేర్లతో నోటికి ఏదివస్తే అది చెబుతూ ఉండాలి. మధ్య మధ్యలో గాయత్రీ మంత్రం లాగా 'నాసా-నాసా' అంటుంటాలి.. అంతే.. ప్రజలు ప్రభుత్వం జోలికి పోనే పోరు. ఆవు, ఆక్సిజన్, గోమూత్రం, కాన్సరూ, ఆవుపేడ, కోహినూరు.. అంటూ జనం అవాక్కయ్యేట్టు చేస్తూ ఉండాలి. అంతే.. ప్రజలు ప్రభుత్వం జోలికి పోరు. అబద్దపు ప్రచారాలు అని అంటే పట్టించుకోకుండా మనుస్మృతి, వేదాలు, రామాయణం, భారతం, ఇతర పురాణాల సారాంశం ప్రచార మాధ్యమాల ద్వారా జనం మీదికి విసురుతుండాలి. వారు అ దెబ్బకు సొమ్మసిల్లిపోతూ ఉంటే, సంజీవనీ పర్వతం తీసుకొస్తున్నామని ఆశపెట్టాలి. అంతే.. ప్రజలు ప్రభుత్వం జోలికి పోరు. అప్పుడెప్పుడో హత్య చేసింది చాలాదన్నట్టు, గాంధీజీ పటాన్ని కూడా పిస్టల్‌తో పేలుస్తూ ఉండాలి. అంతే.. ప్రజలు ప్రభుత్వం జోలికి పోరు. పిండం లేకుండా మనిషి తయారయినట్టు, వాడు పూర్ణ మానవుడయినట్టు, ఈ దేశం తొలి ప్రధాని నెహ్రూ లేకుండానే ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలోకి వచ్చిందని మళ్ళీ మళ్ళీ చెపుతుండాలి. అంతే.. ప్రజలు ప్రభుత్వం జోలికి పోరు. ప్రతి రోజూ డార్విన్‌ని చీల్చి చెండాడుతూ, మూర్ఖత్వాన్ని నిలువెత్తు పటేల్ విగ్రహంగా చేసి నిలబెడితే చాలు.. ప్రజలు ప్రభుత్వం జోలికి పోరంటే పోరు. ప్రజలకు ప్రతిదీ అందించినట్టే మాటలు చెపుతుండాలి. ఒక దేశం, ఒక మతం, ఒక భాష, ఒకే సంస్కృతి.. అంటూ ఉండాలి. అధికారంలో ఉన్నవారు మాత్రం నాలుకలు తాటిమట్టలుగా మార్చుకుని, మాటలు మారుస్తూ ఉండాలి. ఒక మాటమీద మాత్రం ఎప్పుడూ నిలబడగూడదు! అంతే.. సింపుల్! ప్రజలు ప్రభుత్వం జోలికి పోరు. ఆశలు చూయించాలి. ఉత్తుత్తి దేవుళ్ళను చూపించాలి. ఇక వాళ్ళను అదుపులో ఉంచాల్సిందేమీ ఉండదు. ఊపిరి ఆడుతున్న శవాల్లా బతుకుతుంటారు. కొందరయితే అధికారానికి పాదాక్రాంతు లవుతారు. విధేయులుగా మారతారు. మారని వారిమీద పెట్టడానికి రాజద్రోహం కేసు ఉండనే ఉంది. అంతే.. మరి దానితో ప్రజలు ప్రభుత్వం జోలికి పోరంటే పోరు. పోరు గాక పోరు.. ఇదేమిటీ? ఇంత చీకటి రోజులా? చీకటి రోజుల్లో పాటలుండవా? అని ఎవరో గతంలో జర్మన్ మహాకవి బెర్తోల్ట్ బ్రెహ్ట్ ను అడిగారట. అందుకు ఆయన ''ఎందుకుండవూ? చీకటి గురించే పాటలుంటాయి'' అని అన్నారట!
కొన్ని రోజుల క్రితం ఒక మిత్రుడు ఒక సీరియస్ రచన పంపించాడు, అభిప్రాయం కోసం. చాలా బావుంది అని అభినందించాను. అది అందరు చదివి ఆనందిస్తే బావుంటుందని ఇక్కడ పొందుపరుస్తున్నాను.. అది ఇలా సాగుతుంది.. ''అసలైన వేదాలు ఇప్పుడు మనదగ్గర లేవు. ప్రపంచ యుద్ధంలో హిట్లర్ వాటిని పట్టుకుపోయాడు. అవి అగ్రరాజ్యాలకు ఎలా చేరాయో తెలియదు కానీ, వాటిని అమెరికా, రష్యాలు చెరోక సగం పంచుకున్నాయి. ఇప్పుడు నాసా చేస్తున్న పరిశోధనలన్నీ మన ఆ వేదాల ఆధారంగానే జరుగుతున్నాయి. అసలు డార్విన్, ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌లంతా మన వేదాలు చదివి, జీర్ణించుకుని.. వారి వారి సిద్ధాంతాలు ప్రతిపాదించారు. ప్రపంచ ప్రఖ్యాతిని పొందారు. న్యూటన్ పాఠశాల మానేసి బలాదూరు తిరుగుళ్ళు తిరుగుతూ కూడా, గురుత్వాకర్షణ సిద్ధాంతం ఎలా ప్రతిపాదించాడని అనుకుంటున్నారూ? .. కేవలం అంటే కేవలం మన వేదాలు చదవడం వల్లనేనని ప్రపంచం గ్రహించాల్సి ఉంది. అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు ఇంకా ఎవరెవరో తయారుచేశారని అనుకుంటున్నారా? పొరపాటు! మీరు తప్పులో కాలేశారన్నమాటే!! వాటిని మన చిన్ని కృష్ణుడే తయారు చేశాడు. 'వాటిలో సరిపోయినంత పవరు లేదు. ఇంకా నింపాలీ..' అని అనుకుంటూ ఉండగా ఎదురుగా ఎవరో వెన్నముద్దలు తెచ్చారు. ఇకనేం విసురుగా వాటిని చెత్తకుప్పలోకి విసిరేసి అటు వెన్నముద్దల కోసం పరుగుపెట్టాడు. ఇటు చెత్తకుప్పలో బాంబులు బ్రహ్మాండంగా పేలాయి. ఆ రోజును గుర్తుచేసుకోవడం కోసమే మనం దీపావళి రోజు పటాకులు, బాంబులు కాలుస్తున్నాం! (విరాట్ - హిందూత్వ పురాణం నుంచి సంగ్రహించినది)''
''నిద్రపోని దేవుడికి సుప్రభాతమెందుకూ? అపరిశుభ్రంగాని ఆ దేవదేవుడికి అభిషేకమెందుకూ? ఆకలి లేని దేవుడికి నైవేద్యమెందుకూ? అసలు శిలలకు పూజలెందుకురా బాబూ?'' అని ఒక హేతువాది ప్రశ్నిస్తే పరమ భక్తుడయిన ఒక జడ్జిగారు తట్టుకోలేకపోయారు. ''మూర్ఖంగా వాదించకు, అణువణువునా, కణకణాన దేవుడున్నాడు.రాముడు, కృష్ణుడు, ధర్మరాజు, పాండవులు అందరూ మన పూర్వీకులు. వారి పేర్లతో ప్రతి ఊర్లో స్మృతి చిహ్నాలున్నాయి. గుళ్ళూ గోపురాలున్నాయి. ఇంత గట్టి సాక్ష్యాలుంటే అవేవీ కనబడటం లేదా?'' అని కోపగించాడు. ''అయ్యా! అవన్నీ తమతమ భక్తి భావనను నిలుపుకోవడానికి మనవాళ్ళు ఎప్పుడో కట్టుకున్నవి! పురాణ పాత్రలన్నీ కల్పితాలు. వాస్తవంగా ఈ నేలమీద వారెవరూ ఎప్పుడూ జీవించలేదు..'' అని హేతువాది వివరణ ఇవ్వబోయాడు. ''ఛస్! నోరుమూసుకో'' అని కసిరాడు భక్త జడ్జి. ''ఖమ్మం భద్రాచలంలో రాముని పర్ణశాల ఉంది. వరంగల్ జిల్లాలో పాండవుల గుట్ట ఉంది. కాదంటావా? భృమునిగుండు, ధర్మరాజు పాదాలు, హిడింబి బిలం, కుంతమ్మ గుడి.. ఇవన్నీ అబద్దమేనా? వీరంతా మన పూర్వీకులేనన్నది స్పష్టంగా తెలుస్తూ ఉంది కదా? ఎలా కాదంటావ్?'' మరింత తీవ్ర స్వరంతో వాదించాడాయన!
''వామ్మో! ఈయన ఆలోచనా ధోరణి ఇలా ఉంటే, ఇక ఈయన ఇచ్చే తీర్పులెలా ఉండేవో కదా?'' అని పాపం హేతువాది ఆలోచనలో పడ్డాడు. ''అయ్యా! తమరు ఆర్కే నారాయణ్ రాసిన 'మాల్గుడి డేస్' చదివారా? చదవకపోయినా చాలా కాలం అది దూరదర్శన్‌లో సీరియల్‌గా వచ్చింది.'' ''ఆయనెవరో తెలియదు. ఆ సీరియల్ చూళ్ళేదు గానీ, నాకెందుకీ సోదీ'' అని విసుక్కున్నాడు భక్తశిఖామణి. ''అయ్యా! తమ లాంటి వాళ్ళు తెలుసుకోవాలి. ఆయన భారతదేశం గర్వించదగ్గ మహారచయిత. ఆయన ''మాల్గుడి'' అనే ఒక పట్టణం తన సృజనాత్మక రచనలో సృష్టించాడు. అక్కడి మనుషులు, వారి మనస్తత్వాలు, వారి సంస్కృతి, సంప్రదాయాలు అన్నింటినీ సృష్టించి, ఒక అద్భుతమైన జీవితాన్ని చూపించాడు. మానవ ప్రవృత్తులు, మానవ సంబంధాలు అన్నీ అందులో వర్ణించాడు. తమాషా ఏమిటంటేనండీ.. ఆ 'మాల్గుడి' అనే పట్టణం ఎక్కడ ఉందో తెలుసుకుందామని విదేశీయులంతా గ్లోబులో వెతికారు. అదెక్కడ దొరుకుతుందండీ? అది ఆ మహారచయిత మెదడ్లో ఉంది. బయట ఎక్కడా లేదు'' అన్నాడు.
''ఒహా అలాగా? బాగానే ఉంది కానీ ఇదంతా నాకెందుకు చెపుతున్నట్టూ?'' భక్తుడు శాంతించి ఆసక్తిగా అడిగాడు. ''నేను చెప్పేది ఏమిటంటే సార్! మీరంటున్న పురాణ పాత్రలన్నీ కల్పిత పాత్రలే సార్. నిజంగా ఎప్పుడూ ఎక్కడా బతికినవి కావు. 'మాల్గుడి' ఇటీవలి సృష్టి అయితే, మీరు చెప్పే పురాణ పాత్రలు కొన్నివేల సంవత్సరాల క్రితం సృష్టించబడ్డవి. వందేండ్ల నాటివే పర్యావరణ మార్పులకు కొట్టుకుపోతుంటే, రామాయణ భారత రచనా కాలం నాటి ఆనవాళ్ళు ఇంకా నిలబడతాయా సార్? అదంతా ప్రజల విశ్వాసం, భక్తి భావం.. అంతే! అవి నిజమైన ఆనవాళ్ళు కావు'' అని తీర్పు చెప్పాడు హేతువాది. ఏదో నిజం తెలిసినట్టనిపించి, గుడ్లు మిటకరించాడు భక్తుడు.. మతాలు ప్రభుత్వాన్ని శాసిస్తు న్నప్పుడు, ప్రభుత్వాలు వాటి మనుగడ కోసం నిరంతరం తర్కాన్ని నాశనం చేస్తాయన్న మాట!
- వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్.
- డాక్టర్ దేవరాజు మహారాజు
నవతెలంగాణ నుండి,19.10.2019
0 comments:
Post a Comment