కలియుగంలో ప్రత్యక్ష దైవం- శ్రీ వెంకటేశ్వర స్వామి. జీవితములో ఒక్కసారైనా తిరుమలకు వెళ్ళని భక్తుడంటూ ఎవరూ ఉండరు. అయితే చాలా మందికి సమయాభావం వల్ల, వేరే కారణాల చేత తిరుమల మాడ వీధులలో ఉన్న అన్ని ప్రదేశాలను చూసే అవకాశం కలిగి ఉండకపోవచ్చు. అందుకే నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు వివరిస్తూ వాటిని ఒక మ్యాప్ రూపంలో అందచేయాలనుకుంటున్నాను.
తిరుమల మాడ వీధులలో అత్యంత పరమ పవిత్రమైనది- స్వామి వారి పుష్కరిణి. ఈ స్థల పురాణాన్ని అనుసరించి, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి, వాయువ్య దిక్కున ఉన్న వరాహస్వామి ఆలయాన్ని మొదటిగా దర్శించుకోవాలి. ఆ తర్వాత చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమే అత్యంత ఫలప్రదంగా చెప్పబడుతుంది. ఈ పుష్కరిణి ఈశాన్య భాగంలో వ్యాసతీర్థుల వారి ఆహ్నిక మండపం, అలాగే ఈయన ప్రతిష్టించిన హనుమంతుని మందిరం చూడవచ్చును. ఈ పుష్కరిణికి పశ్చిమాన కొంచెం ఎత్తులో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సన్నిధి ఉంది.
తిరుమల మాడవీధుల్లో ఎన్నో ఉపాలయాలు కూడా ఉన్నాయి. మొదటిగా వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఎదురుగా, అంటే తూర్పు దిక్కున, బేడి ఆంజనేయస్వామి ఆలయం ఉన్నది. ఈయన చేతులు కట్టుకుని అంజలి ఘటిస్తూఉన్న భంగిమలో నిలబడి ఉంటారు. ఈయన ఆలయానికి ముందర అఖిలాండం, అంటే అఖండజ్యోతి కూడా ఉన్నది. ఉత్తర మాడవీధుల్లో అందరి చూపులు ఆకట్టుకునేది, ఈశాన్యదిక్కున ఉన్న శ్రీలక్ష్మీహయగ్రీవ ఆలయం. ఈ ఆలయానికి ఆనుకుని పక్కన ఉన్నదే- శ్రీరాధాక్రిష్ణ ఆలయం. అలాగే ఆ చివరిలో, అంటే వాయువ్య దిక్కులో అహోబిల మఠం, శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని కూడా దర్శించి తరించవచ్చును.
ఇప్పుడు స్వామి వారి సేవలో తరించిన కొంత మంది భక్తులు గురించి తెలుసుకుందాం. తరిగొండ వెంగమాంబ శ్రీ వెంకటేశ్వరస్వామివారికి పరమభక్తురాలు. యాత్రికుల కొరకు ఆమె అన్నసత్రాలను, చలివేంద్రాలను నిర్వహించేది. ఇప్పటికీ తరిగొండ వెంగమాంబ బృందావనం, వరాహస్వామివారి ఆలయానికి ఉత్తరం దిక్కున, ఒక పాఠశాల ప్రాంగణంలో చూడవచ్చు. స్వామివారి ఆలయానికి బయట, అంటే ఆగ్నేయ దిక్కులో, ఎతైన గుట్టపై ఉన్న మహంతుల మఠానికి మూలపురుషుడు బావాజీ. ప్రతిరాత్రి ఏకాంతసేవ అనంతరం, ఈయన మఠానికి వచ్చి వేంకటేశ్వరుడు పాచికలు ఆడేవారు. తన జీవితం మొత్తం స్వామి వారి సేవలో తరిస్తూ, తిరుమలలోనే పరమపదించిన మరొక భక్తుడు, తిరుమల నంబి. ఈయన రామానుజాచార్యుల వారికి గురువు మరియు స్వయానా మేనమామ కూడా. ఇది సుపథం ప్రవేశ ద్వారం దగ్గరలో ఉంది.
శ్రీవారి ఆలయంలో, సుప్రభాతం నుండి ఏకాంతసేవ వరకూ, నిత్యకల్యాణం నుండి వార్షికబ్రహ్మోత్సవాల వరకూ, అన్ని పూజలు వైఖానస ఆగమశాస్త్ర విధిగానే జరుగుతాయి. ఇది మనకు అందించినవారు శ్రీ విఖనస మహర్షి మరియు వారి శిష్యులైన భృగువు, అత్రి, మరిచి, కశ్యప మహర్షులు. వీరి సన్నిధి శ్రీరాధాక్రిష్ణ ఆలయం పక్కన ఉన్నది. ఇక ప్రతిరోజు స్వామివారి ఆలయానికి బయట జరిగే ఒకేఒక్క సేవ- సహస్రదీపాలంకరణ సేవ. ఆగ్నేయ దిక్కున దీపాలు వెలిగించిన మండపంలో, సాయంత్రం 5:30 నిమిషాలకు, ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామివారిని ఊయలలో ఊగిస్తూ అన్నమయ్య సంకీర్తనలు, వేదశ్లోకాలతో స్తుతిస్తారు.
ఇక చివరిగా- అటు స్వామివారికి, ఇటు భక్తులందరికి ఉల్లాసం కలిగించే రెండు ప్రదేశాలు చూద్దాం. గోవింద నామాలు, అన్నమయ్య సంకీర్తనలకు అనుగుణంగా రంగురంగుల విద్యుద్దీపాల నడుమ నీటిధారలు చేసే విన్యాసాలు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మ్యూజికల్ ఫౌంటెన్ వద్ద చూడవచ్చు. అలాగే వివిధ కళాకారులకు కూడా స్వామివారి సేవ చేసుకునే అవకాశం కల్పిస్తున్న వేదిక- నాదనీరాజనం. ఇది ఆగ్నేయ దిక్కులో, బేడి ఆంజనేయస్వామి ఆలయం దగ్గరిలో ఉన్నది.
Srigiri Nilayam
0 comments:
Post a Comment