3/22/2014
0
 నది భాష

ఒడ్డున కూర్చుని, నదికి
నా కవిత్వం వినిపిస్తున్నాను
వింటోందా నది
నా కవిత్వం వానలో తడుస్తోందా నది
ఎలా తెలుస్తుంది నాకు
నేలలోపలి ఆకుపచ్చని అందాలు
మొక్కలుగా పుట్టినట్టు
నాలోలోపలి గోరువెచ్చని ఊహలు
కవితలుగా జన్మించాయని
నదికి తెలుసునో లేదో
ఎలా తెలుస్తుంది నాకు
నది భాష నాకు తెలియదు కదా
చినుకు భాష విత్తుకు తెలిసినట్టు
వేణువు భాష వేళ్ళకు తెలిసినట్టు
పువ్వుల భాష తేటికి తెలిసినట్టు
నది భాష ఎవరికి తెలుసు
చంటి బిడ్డల్ని
చంకన మోసే కన్న తల్లిలా ఈ నది
పడవల్ని మోస్తోంది
అమ్మభాష బిడ్డకు తెలియదా
నా కవిత్వం విని నది ఏమనుకుంటోందో
ఇటు వస్తున్న పడవల్నడుగుతాను